NASA | న్యూఢిల్లీ: నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. వందల కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలను అన్వేషించింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ గ్రహ శకలంలో 100000 డాలర్ల క్వాడ్రిలియన్ విలువైన లోహాలు ఉన్నట్టు నాసా తెలిపింది. ఈ విషయం శాస్త్రవేత్తలు, అంతరిక్ష ఔత్సాహికులను ఆశ్చర్యపరిచింది. అయితే వీటిని వెలికితీయడానికి పలు ఆర్థిక, సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటున్నది. 2029 నాటికి ఆస్టరాయిడ్లను చేరుకునే లక్ష్యంతో నాసా సైకి మిషన్ను 2023 అక్టోబర్ 13న ప్రారంభించింది. తన పరిశోధనలో భాగంగా గ్రహశకలం 16 సైకిపై అపారంగా బంగారం, ప్లాటినం, నిఖిల్ వంటి ఖరీదైన లోహాలు ఉన్నట్టు నాసా నిర్ధారించింది. అవి తవ్వి భూమి మీదకు తేగలిగితే ప్రపంచ దేశాల స్థితిగతులే మారిపోతాయని పేర్కొంటున్నది.
ప్రస్తుత అంతరిక్ష మైనింగ్ సాంకేతికత ఇంకా శైశవ దశలోనే ఉంది. తక్కువ గురుత్వాకర్షణ, అధిక రేడియేషన్ ఉండే ఈ లఘుగ్రహంలో కార్యకలాపాలు నిర్వహించగల పరికరాలు అవసరమవుతాయి. అంతేకాకుండా భూమికి, గ్రహశకలం మధ్య కమ్యూనికేషన్లో ఏర్పడే ఆలస్యం వల్ల అవి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రహ భౌతిక శాస్త్రవేత్త ఫిలిప్ మెట్జ్గర్ తెలిపారు. గ్రహాలపై ఖనిజాల తవ్వకం అతి ఖరీదైన వ్యవహారం. వాటిపై తవ్వకాలు జరపడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు సమకూర్చుకోవడానికి చాలా వ్యయం అవుతుంది. అయితీ వీటిపై తవ్వకాలకు నిధులు సమకూర్చడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తున్నా, ముఖ్యమైన వనరులు ఇంకా అవసరమవుతాయి.
అక్కడి నుంచి తెచ్చే ఈ లోహాలు ప్రపంచ మార్కెట్లోకి భారీ మొత్తంలో ప్రవేశపెడితే బులియన్, మెటల్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అవుతాయి. వాటి విలువ నాటకీయంగా తగ్గిపోతుంది. రూ.60 వేలు ఉన్న బంగారం ధర 600కు పడిపోవచ్చు. దీనంతటికీ డిమాండ్-సప్లయి సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు బంగారం సప్లయి తక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ పెరిగి దాని ధర ఎక్కువగా ఉంది. అదే డిమాండ్ లేకపోతే, మార్కెట్లో కావాల్సినంత దొరికితే అది కూడా ఏ స్టీల్ లోహం ధరకో సమానంగా పడిపోతుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తీవ్ర కుదుపులు సంభవిస్తాయి. వాటి ప్రభావం పలు పరిశ్రమలు, రంగాలపై తీవ్రంగా పడుతుంది. పౌరుల వద్ద ఉన్న ఆస్తుల విలువ తగ్గిపోతుంది.