బిలాస్పూర్: హిమాచల్ ప్రదేశ్లోని లఘట్ గ్రామ మహిళలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. లఘట్ మహిళా మండలి అధ్యక్షురాలు పింకీ శర్మ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకుని, పోలీసులకు అప్పగించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వారిని పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. తమ గ్రామానికి చెందిన మహిళలు టార్చిలైట్లు, దుడ్డు కర్రలు పట్టుకుని గస్తీ తిరుగుతున్నామని చెప్పారు. ఈ గస్తీ బృందాల్లో 25-50 ఏళ్ల వయస్కులు ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడం వల్ల కేవలం ఆ వ్యక్తులు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు, చివరికి సమాజం నష్టపోతున్నాయని చెప్పారు. ఈ మహిళా మండలి సభ్యురాలు అంజు శర్మ మాట్లాడుతూ, కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ను బయటివారు ఉపయోగించుకుంటూ, తమ గ్రామంలోని యువతను డ్రగ్స్ వైపు ఆకర్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.