న్యూఢిల్లీ: ‘మమ్మల్ని పూజించ వద్దు.. సమానత్వం ఇవ్వండి చాలు’ అంటూ రాజధానిలో మహిళలు నినదించారు. చట్టసభల్లో మహిళలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని 60 మందికి పైగా మహిళా సంఘాలు ఎంపీలకు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు గురువారం ఢిల్లీ ప్రెస్ క్లబ్లో పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. రిజర్వేషన్లను తక్షణం అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్ను జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన నుంచి వేరు చేసి సవరణలు చేయాలని వారు కోరారు. దామాషా పద్ధతిలో సీట్ల కేటాయింపు, బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం, రాజ్యసభలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీలకు తమ డిమాండ్లతో కూడిన వినితిపత్రాన్ని పంపారు. తాము ప్రధానంగా మూడు డిమాండ్లను పిటిషన్లో ప్రస్తావించినట్టు రచయిత్రి రాధా కుమార్ వెల్లడించారు. రాష్ర్టాలకు వాటి ప్రస్తుత సీట్ల వాటాకు దామాషా పద్ధతిలో 33 శాతం రిజర్వ్ సీట్లను కేటాయించాలని, అంతేకాకుండా దానికి అదనంగా బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలతో పాటు ఓబీసీ, ఎల్జీబీటీ, డీనోటిఫై చేసిన తెగలకు చెందిన మహిళల ఎన్నికల ప్రచారానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా వచ్చే వర్షాకాల సమావేశంలో రాజ్యాంగ సవరణ చేయాలని వారు కోరారు.