లక్నో: భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళా ఖైదీలు కర్వా చౌత్ సందర్భంగా జైలులో ఉపవాసం ఆచరించారు. ఉత్తర ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కర్వా చౌత్ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. గురువారం కర్వా చౌత్ నేపథ్యంలో జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలు ఉపవాసం ఉండి ఈ పూజలు నిర్వహించేందుకు యూపీ జైళ్ల శాఖ మంత్రి అనుమతించారు. పూజా సామగ్రితోపాటు తినుబండారాలను కూడా వారి కుటుంబం నుంచి అనుమతించారు. అలాగే కర్వా చౌత్ కోసం జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళా ఖైదీల భర్తలను కూడా ఈ పూజలకు అనుమతించారు.
కాగా, కర్వా చౌత్ సందర్భంగా లక్నో జైలులోని సుమారు 50 మంది మహిళా ఖైదీలు గురువారం ఉపవాస దీక్ష ఆచరించారు. వీరిలో పది మంది మహిళలు తొలిసారి ఈ పూజలు చేశారు. అలాగే గోరఖ్పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు.
అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు. అలాగే ప్రియుడి సహకారంతో సోదరుడ్ని హత్య చేసిన ఒక ముస్లిం మహిళ కూడా కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటించినట్లు జైలు అధికారులు తెలిపారు.