Women Commission : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) మృతుడి భార్యను నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. దాంతో జాతీయ మహిళా కమిషన్ (National Women Commission) తీవ్రంగా స్పందించింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించింది. మతం పేరు అడిగి మారణహోమం సృష్టించడం దారుణమని పేర్కొంది.
ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయన సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేశారు. ఇది కొందరు నెటిజన్లకు రుచించలేదు. దాంతో ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఉద్దేశించి కామెంట్లు చేయడం ఏమాత్రం తగదని, దీనిపై కేంద్రం స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలోనే తాజాగా మహిళా కమిషన్ స్పందించింది. పహల్గాం ఉగ్రదాడితో ఎన్నో కుటుంబాలకు తీరనిలోటు ఏర్పడిందని వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను కూడా మతం పేరు అడిగి ప్రాణాలు తీశారని విమర్శించింది. ఉగ్రఘటనపై దేశం మొత్తం ఆగ్రహంగా ఉందని, ఈ క్రమంలో హిమాన్షి నర్వాల్ వ్యక్తంచేసిన అభిప్రాయంపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహించింది.
హిమాన్షి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఖండించదగినదని, ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా, రాజ్యాంగ హద్దులకు లోబడి వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. జాతీయ మహిళా కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టింది.
కాగా హర్యానాకు చెందిన వినయ్-హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవ జంట.. తమ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లై వారం కూడా గడవక ముందే భర్తను కోల్పోయింది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరిని బాధించింది.