చండీగఢ్: బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్ పడి ఉండటం కలకలం రేపింది. తెరిచి చూసిన పోలీసులు అందులో యువతి మృతదేహం ఉండటంతో షాక్ అయ్యారు. మృతురాలిని కాంగ్రెస్ మహిళా కార్యకర్తగా గుర్తించారు. (Woman’s Body In Suitcase) రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొన్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాంప్లా బస్టాండ్ సమీపంలో బ్లూ కలర్లో ఉన్న పెద్ద ట్రావెల్ బ్యాగ్ పడి ఉంది. అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూట్‌కేస్‌లోని యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని 22 ఏళ్ల హిమానీ నర్వాల్‌గా గుర్తించారు. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి బస్టాండ్ సమీపంలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Congress Worker’s Body
మరోవైపు హతురాలు హిమానీ నర్వాల్ కాంగ్రెస్ కార్యకర్త అని ఆ పార్టీ ఎమ్మెల్యే భరత్ భూషణ్ బాత్రా తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుకుగా పాల్గొన్నట్లు చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపిందర్ హుడా, దీపిందర్ హుడా ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నట్లు వెల్లడించారు.
కాగా, తన కుమార్తె హిమానీ హత్యకు కాంగ్రెస్ పార్టీలోని కొంతమందికి ప్రమేయం ఉండవచ్చని ఆమె తల్లి సవితా నర్వాల్ అనుమానం వ్యక్తం చేసింది. తన కుమార్తె రాజకీయంగా ఎదుగుతుండటం చూసి కొందరు సహించలేక ఆమెను హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించింది.