ముంబై, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తనను దేవుడి అవతారంగా ప్రచారం చేసుకొన్న స్వయం ప్రకటిత గురువును అత్యాచార ఆరోపణలపై పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హర్యానాకు చెందిన రాధామోహన్ మిశ్రా(59)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పుణెలోని ఒక బంగ్లాలో అతడు ఆశ్రమం నిర్వహిస్తూ కుటుంబ వివాదాలు, ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చి అనుచరులను ఆకర్షించాడు. తనకు దైవ శక్తులున్నాయని హర్యానాకు చెందిన ఒక మహిళను(41) నమ్మించి ఆమెపై పదిహేనేండ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమెకు విద్యుత్ షాక్‌లు ఇస్తూ హింసించాడు. ఆమె గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి కుటుంబం, భర్త నుంచి వేరు చేశాడు. ఆమె, ఆమె భర్త ప్రైవేట్ వీడియోలను సేకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెను తన ఆశ్రమంలోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలో జీవించేలా చేశాడు. ఇటీవల ఆమె సీసీటీవీలను పగులగొట్టి ఆశ్రమం నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి ఆశ్రమం నుంచి 12 ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సీడీలు, రూ.6.5 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడికి ఉత్తరాదిలోని పలు రాష్ర్టాల్లో అనుచరులున్నారు.