తిరువనంతపురం: ముఖానికి మాస్క్ ధరించిన మహిళ, మరో మహిళపై కాల్పులు జరిపింది. (Woman Shot At By Masked Woman) అయితే వెంటనే స్పందించిన బాధిత మహిళ తన చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె అరచేతిలోకి బుల్లెట్ దిగడంతో గాయమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. వంచియూర్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల షైనీ ప్రభుత్వ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. ఆమె భర్త మాల్దీవుల్లో ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా, ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ కొరియర్ డెలివరీ పేరుతో షైనీ ఇంటికి వచ్చింది. కాలింగ్ బెల్ నొక్కగా మామ భాస్కరన్ నాయర్ బయటకు వచ్చాడు. అయితే షైనీకి కొరియర్ వచ్చిందని ఆ మహిళ తెలిపింది. ఆమె సంతకం తీసుకున్న తర్వాత దానిని అందజేయాలని చెప్పింది.
మరోవైపు మామ పిలువడంతో ఇంట్లో ఉన్న షైనీ బయటకు వచ్చింది. కొరియర్ తీసుకుంటుండగా ఆ మహిళ ఎయిర్ పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపింది. అయితే వెంటనే స్పందించిన షైనీ తన కుడి చేతిని ముఖానికి అడ్డుగా పెట్టింది. ఈ నేపథ్యంలో అరచేతికి బుల్లెట్ గాయమైంది. కాల్పులు జరిపిన మహిళ వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, కాల్పుల్లో గాయపడిన ప్రభుత్వ ఉద్యోగిని షైనీని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షైనీపై కాల్పులు జరిపిన మహిళను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.