పాట్నా: రైల్వే స్టేషన్ వద్ద దారుణం జరిగింది. ఊరు వెళ్లేందుకు అక్కడకు వచ్చిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang Raped Near Railway Station) బాధితురాలి ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పక్షవాతానికి గురైన తండ్రికి వైద్య చికిత్స కోసం శ్యాంపూర్ గ్రామంలో ఉంటున్న యువతి ఉత్తరప్రదేశ్‌కు తిరిగి వెళ్లాలని భావించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ససముసా రైల్వే స్టేషన్‌కు ఆమె చేరుకున్నది.
కాగా, రైలు కోసం వేచి ఉన్న ఆ యువతి మంచినీరు తాగేందుకు పంపు వద్దకు వెళ్లింది. అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ఆమె నోరు మూసి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని అక్కడ వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన తర్వాత బాధిత యువతి తండ్రి వద్దకు తిరిగివెళ్లింది. జరిగిన దారుణం గురించి చెప్పింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు. ఆ మహిళ చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఒక నిందితుడ్ని అభిషేక్ బింద్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.