Fire Breaks | చెన్నై : తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. అగ్నికీలల్లో ఒక మహిళా అధికారి సజీవదహనం కాగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బుధవారం రాత్రి 8.45 గంటలకు నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వెళ్లిన సమయంలో ఎల్ఐసీ భవనం పైఅంతస్తులో మంటలు ఎగిసిపడిన దృశ్యాలను చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. అప్రమత్తమై పైఅంతస్తుకు పరుగెత్తి అద్దాలు పగులగొట్టగా.. లోపలి నుంచి ఓ వ్యక్తి కాలిన గాయాలతో బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిపారు. మంటల్లోనే ఓ మహిళా చిక్కుకుపోయిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.