తిరువనంతపురం: ఒక వ్యక్తి ఆరేళ్ల కిందట ఒక మహిళను హత్య చేశాడు. అరెస్టై జైలులో ఉన్న అతడు బెయిల్పై విడుదలయ్యాడు. మహిళ భర్త ప్రతీకారంతో తనను చంపుతాడేనని అనుమానించాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆమె అత్తను హత్య చేశాడు. (double murder) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నెన్మారాలో నివసిస్తున్న 58 ఏళ్ల చెంతమర భార్య, పిల్లలు ఆరేళ్ల కిందట అతడ్ని విడిచి వెళ్లిపోయారు. తన కుటుంబం విచ్ఛిన్నం కావడానికి పొరుగున ఉన్న సుధాకరన్ కుటుంబం చేతబడి కారణమని అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో 2019లో సుధాకరన్ భార్య సజితను అతడు హత్య చేశాడు. పోలీసులు అరెస్ట్ చేయడంతో రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్నాడు.
కాగా, నిందితుడు చెంతమర ఇటీవల బెయిల్పై జైలు నుంచి విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు. సజితను హత్య చేసిన తనపై ఆమె భర్త సుధాకరన్ ప్రతీకారం తీర్చుకుంటాడేనని అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేశాడు. జనవరి 27న 50 ఏళ్ల సుధాకరన్, అతడి తల్లి అయిన 72 ఏళ్ల లక్ష్మిని వారి ఇంట్లో కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. చివరకు మంగళవారం నిందితుడు చెంతమరను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టారు.
మరోవైపు తండ్రి, నానమ్మపై చెంతమర దాడి సమయంలో సుధాకరన్ పిల్లలు, అతడి రెండో భార్య ఇంట్లో లేరు. దీంతో అతడి దాడి నుంచి వారు తప్పించుకున్నారు. అయితే తమ కుటుంబాన్ని అంతం చేయాలని చెంతమర కక్ష గట్టినట్లు సుధాకరన్ కుమార్తెలు అఖిల, అతుల్య ఆరోపించారు. బెయిల్పై విడుదలైన చెంతమర గ్రామానికి దూరంగా ఉండాలన్న కోర్టు షరతును లెక్కచేయలేదని విమర్శించారు. అతడి వల్ల తమకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని సుధాకరన్ కుమార్తెలు ఆరోపించారు. కాగా, డబుల్ మర్డర్ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.