బెంగళూరు: ఒక వ్యక్తి, మహిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పుట్టింట్లో ఉంటున్న ఆమె కుటుంబానికి ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అతడ్ని వదిలించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. తల్లి సహాయంతో భర్తను ఆ మహిళ హత్య చేసింది. (woman kills husband) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మార్చి 22న సాయంత్రం వేళ నిర్మాణుష్య ప్రాంతంలో ఆగి ఉన్న కారులో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కత్తితో గొంతు కోసి అతడ్ని హత్య చేసినట్లు పరిశీలించారు. మృతుడ్ని 37 ఏళ్ల లోక్‌నాథ్ సింగ్‌గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్, లోన్ కన్సల్టెంట్ అయిన అతడ్ని వ్యక్తిగత లేదా ఆర్థిక వివాదాల వల్ల హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, లోక్‌నాథ్ హత్య కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 21 ఏళ్ల యశస్వినితో రెండేళ్లపాటు రహస్య సంబంధాన్ని కొనసాగించిన అతడు 2024 డిసెంబర్లో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి తెలియకుండా దాచేందుకు పుట్టింట్లోనే ఉంచాడు.
మరోవైపు వయస్సు గ్యాప్ ఎక్కువగా ఉన్న లోక్‌నాథ్, యశస్వినికి పెళ్లి జరిగిందన్న విషయం ఆమె కుటుంబ సభ్యులకు ఇటీవల తెలిసింది. అలాగే అతడికి వివాహేతర సంబంధాలున్నాయని, అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు చేస్తున్నాడని అనుమానించారు. ఈ నేపథ్యంలో లోక్‌నాథ్, యశస్విని కుటుంబం మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అతడి నుంచి బెదిరింపులు రావడంతో అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశారు.
కాగా, మార్చి 22న చర్చల పేరులో ఒక రెస్టారెంట్‌కు లోక్‌నాథ్‌ను యశస్విని రప్పించింది. ఆమె తల్లి 37 ఏళ్ల హేమా బాయి కూడా ఆటోలో ఫాలో అయ్యింది. వారిద్దరూ కలిసి లోక్‌నాథ్ తిన్న ఫుడ్‌లో నిద్రమాత్రల పౌడర్ కలిపారు. ఆ తర్వాత అతడి కారులో ఒక చోటకు వెళ్లారు. అక్కడ మగతలో ఉన్న లోక్‌నాథ్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులైన యశస్విని, ఆమె తల్లి హేమా బాయిని అరెస్ట్ చేశారు. అయితే ఒక మోసం కేసులో లోక్‌నాథ్‌పై దర్యాప్తు జరుగుతున్నదని పోలీస్ అధికారి వెల్లడించారు.