డామన్: భార్యాభర్తల మధ్య గొడవ పిల్లల ఉసురు తీసింది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. (Woman Kills Sons) దీంతో చిన్నారులైన ఆ పిల్లలు మరణించారు. అనంతరం బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించగా భర్త అడ్డుకుని కాపాడాడు. కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డయూలో ఈ సంఘటన జరిగింది. జనవరి 20న రాత్రివేళ డామన్ జిల్లా నాని డామన్ ప్రాంతంలోని దల్వాడ ప్రాంతంలో నివసిస్తున్న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన సీమా యాదవ్, మూడేళ్ల లోపు వయస్సున్న తన ఇద్దరు కుమారులను బిల్డింగ్ నాలుగో అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె కూడా కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన భర్త ఆమెను పట్టుకుని వెనక్కిలాగాడు.
కాగా, తల్లి విసిరేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిన ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిల్లలను చంపిన తల్లి సీమాను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.