బెంగళూరు, జనవరి 21: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బస్ కోసం వేచిచూస్తున్న మహిళను మభ్యపెట్టి తీసుకెళ్లిన కొందరు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాక, ఆమె వద్ద ఉన్న నగలు, నగదును దోచుకున్నారు. కాగా, అత్యాచారాలు జరగడం రాష్ట్రంలో ఏమన్నా కొత్తా అన్న రీతిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11.30 గంటలకు బెంగళూరు కేఆర్ మార్కెట్ ప్రాంతంలోని గోడౌన్ స్ట్రీట్ వద్ద ఒక మహిళ ఎలహంక వెళ్లడానికి బస్ కోసం వేచి చూస్తున్నది.
బస్ ఎన్నిగంటలకు వస్తుందని నిందితులను అడిగింది. దాంతో వారు బస్ వేరే చోట ఆగుతుందని నమ్మించి ఆమెను గోడౌన్ వీధిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దోచుకుని ఉడాయించారు. బాధితురాలు సెంట్రల్ డివిజన్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత విజయేంద్ర డిమాండ్ చేశారు.
బీజేపీ హయాంలో అత్యాచారాలు జరగలేదా? అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. మహిళపై లైంగిక దాడిపై బీజేపీ చేస్తున్న డిమాండ్ గురించి ఆయన బెళగావిలో స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ పాలించిన కాలంలో లైంగిక దాడులు జరగలేదా? అని ప్రశ్నించారు. అయితే మహిళలపై అత్యాచారాలు జరగకూడదని, వారికి రక్షణ కల్పించాలని అన్నారు. సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తులు లైంగిక దాడులకు పాల్పడుతున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.