Viral News | హర్దోయి(యూపీ), జనవరి 7: ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి ఓ యాచకుడితో వెళ్లిపోయింది. తన భార్యను అపహరించారంటూ ఆమె భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు భార్య దొరికిందని, అయితే నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తన భార్య రాజేశ్వరి, ఆరుగురు పిల్లలతో కలసి తాను హర్దోయిలోని హర్పాల్పూర్ ప్రాంతంలో నివసిస్తున్నానని రాజు తన ఫిర్యాదులో తెలిపాడు.
నన్హే పండిట్ అనే 45 ఏళ్ల యాచకుడు తరచు తమ ప్రాంతానికి భిక్షాటన కోసం వస్తుంటాడని రాజు పేర్కొన్నాడు. తన భార్య రాజేశ్వరితో మొబైల్ ఫోన్లో చాటింగ్ చేయడం, ఫోన్లో మాట్లాడడం కూడా చేస్తుంటాడని ఆయన చెప్పాడు. జనవరి 3న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్ వెళ్లివస్తానని తన కుమార్తె కుష్బూకు చెప్పి వెళ్లిన రాజేశ్వరి సాయంత్రమైనా తిరిగి రాలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గేదెను అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచానని, ఆ డబ్బు కనపడడం లేదని చెప్పాడు. తన భార్యను నన్హే పండిట్ తీసుకెళ్లి ఉంటాడని ఆయన ఫిర్యాదు చేశాడు. రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నన్హే పండిట్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.