Uttar Pradesh | లక్నో, జనవరి 29: గుండెపోటు రావడంతో దవాఖానకు తీసుకువచ్చిన వృద్ధురాలిని డ్యూటీ డాక్టర్ పట్టించుకోకుండా మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కళ్లముందే బాధితురాలు మరణించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మణిపూరిలోని మహరాజ తేజ్ సింగ్ జిల్లా దవాఖానలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
ప్రవీణ్ కుమారి అనే వృద్ధురాలికి ఛాతిలో నొప్పి రావడంతో ఆమె కుమారుడు గురుశరణ్ సింగ్ ఆమెను దవాఖానకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో డాక్టర్ ఆదర్శ్ సాగర్ డ్యూటీలో ఉన్నారు. ఒక పక్క బాధితురాలు బాధతో విలవిల్లాడుతున్నా డాక్టర్ కనీసం లేచి ఆమెను పరీక్షించకుండా తన కుర్చీలోనే కూర్చుని ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూస్తున్నాడు. పైగా ఆమెను చూడమంటూ నర్సింగ్ సిబ్బందిని ఆదేశించాడు.
తన తల్లి పరిస్థితి విషమించడంతో రోగి కుమారుడు, బంధువులు కేకలు వేయడంతో ఎట్టకేలకు డాక్టర్ కుర్చీలోంచి లేచాడు. లేచి రోగిని చూడటానికి బదులు రోగి కుమారుడిని చెంపపై కొట్టి తన విసుగును ప్రదర్శించాడు. అప్పటికే రోగి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పెద్దయెత్తున పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్టు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మదన్ లాల్ తెలిపారు. ‘ఇలాంటి వ్యక్తి డాక్టర్ వృత్తికే చీడపురుగు’ అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.