చెన్నై: నిండు గర్భిణీ అయిన మహిళ, యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. పలు ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ మహిళ మరణించింది. (woman dies attempting home birth) తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉతుకులి సమీపంలోని తలవాయ్పాళ్యెం గ్రామానికి చెందిన 32 ఏళ్ల శశికళ, కార్తీక్ భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉన్నది.
కాగా, శశికళ రెండోసారి గర్భందాల్చింది. అయితే సిజేరియన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ఆమె ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కాకుండా ఇంట్లోనే సహజంగా ప్రసవించేందుకు ప్రయత్నించింది. దీని కోసం యూట్యూట్‌లో సహజ ప్రసవాలకు సంబంధించిన వీడియోలు చూసింది.
మరోవైపు జూన్ 24న శశికళ ఇంట్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఆగకపోవడంతో పెరుందురైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి ఆ మహిళను తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మరణించింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఉతుకులి పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.