న్యూఢిల్లీ : నేషనల్ స్ప్రింట్ టీం చీఫ్ కోచ్‌పై ప్రముఖ మహిళా సైక్లిస్ట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. స్లొవేనియాలో క్యాంప్ సందర్భంగా కోచ్ ఆర్కే శర్మ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని మహిళా సైక్లిస్ట్ ఆరోపించింది. జూన్ 18 నుంచి 22 వరకూ ఢిల్లీలో జరిగే ఆసియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్స్ కోసం ఏర్పాటైన సన్నాహక శిబిరంలో సైక్లిస్ట్ పాల్గొంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ)కు మహిళా సైక్లిస్ట్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో మహిళా సైక్లిస్ట్‌ను భారత్‌కు పంపినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ఎస్ఏఐ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలు వేర్వేరుగా విచారణ కమిటీలు ఏర్పాటు చేశాయి.
స్లొవేనియాలో జరిగిన క్యాంప్‌లో కోచ్ తనను అభ్యంతరకరంగా ప్రవర్తించాడని సైక్లిస్ట్ ఫిర్యాదు చేసిందని సీఎఫ్ఐ సిఫార్సు మేరకు నియమించిన కోచ్ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో బాధితురాలిని తక్షణమే భారత్‌కు రప్పించామని ఎస్ఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.