లక్నో: మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చేసింది. (Woman calls off wedding) దీంతో ఈ వివాదం పోలీసుల వద్దకు చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల శశికి మే 18న అమిత్ రాణాతో వివాహం జరుగాల్సి ఉన్నది. వరుడు అమిత్ తన బంధువులు, స్నేహితులతో కలిసి మేళతాళాలతో పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు.
కాగా, పెళ్లికొడుకు అమిత్ తాగి ఉండటాన్ని గమనించి వధువు శశి ఆగ్రహించింది. అయితే తనకు తెలియకుండానే స్నేహితులు కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చారని వరుడు చెప్పాడు. అమిత్‌తో పాటు అతడి స్నేహితులు, బంధువులంతా మద్యం మత్తులో ఉండటంతో పెళ్లికి ఆమె నిరాకరించింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్దల మధ్య పంచాయితీ జరిగింది. పెళ్లి ఖర్చులు చెల్లించాలని వధువు కుటుంబం డిమాండ్ చేసింది. అయితే చెల్లించేందుకు వరుడి కుటుంబం నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వధువు వాంగ్మూలంతో వరుడు అమిత్, అతడి బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం రూ.7 లక్షలు చెల్లించేందుకు వరుడి కుటుంబం అంగీకరించింది.