బెంగళూరు, ఆగస్టు 9: తన భాగస్వామిగా ఉన్న మహిళను ఒక వ్యక్తి ముక్కలుగా నరికి అడవిలో పారేసిన ఢిల్లీ శ్రద్ధవాకర్ హత్య కేసు తరహా ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లాలోని చింపుగనహళ్లి గ్రామంలో ఈ నెల 7న ఒక మహిళ తెగిన తలను ఒక కుక్క నోట కర్చుకు రావడంతో స్థానికులు షాక్ తిన్నారు. దానికి కొంత దూరంలో ఆ మహిళ చేయి కూడా లభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ మిగిలిన శరీర భాగాలను 10 ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎవరో ఆమెను ముక్కలుగా నరికి శరీర భాగాలను వివిధ ప్రదేశాల్లో పడేసినట్టు గుర్తించారు.
ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు, ముఖం ఆధారంగా బాధితురాలిని తుమకూరు తాలుకాలోని బెల్లవి గ్రామానికి చెందిన 42 ఏండ్ల లక్ష్మీదేవమ్మగా గుర్తించారు. ఆమె ఈ నెల 4న అదృశ్యమైనట్టు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడో తేదీన కుమార్తెను చూడానికి మరో ఊరు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బహుశా ఆమెను ఆ రోజు రాత్రే హంతకులు దారుణంగా హత్య చేసి గుర్తు పట్టకుండా ఆమె శరీర భాగాలను విడిగా పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.