జైపూర్, మార్చి 4: తాము ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని 2019 పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల భార్యలు రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్ప తమకు మరో మార్గం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొన్ని రోజులుగా వీర జవాన్ల భార్యలు ధర్నా చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరిట స్మారకాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. పోలీసులు తోసి వేయడంతో మంజు అనే వీర జవాన్ భార్య గాయపడ్డారని మరో జవాన్ భార్య మీనా ఆరోపించారు.