Rajya Sabha : ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా తీవ్ర గందరగోళం నెలకొన్నది. దాంతో ముందుగా లోక్సభ, ఇప్పుడు రాజ్యసభ రేపటికి వాయిదాపడ్డాయి.
లోక్సభలో గందరగోళంలో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చ కోరుతూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అయినా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో కొన్ని అంశాలపై విపక్షాలు లేకుండానే చర్చించారు. ఆపై పెద్దల సభను రేపటికి వాయిదా వేశారు.