Attack : భారత వైమానిక దళం (Indian Air Force) కు చెందిన వింగ్ కమాండర్ (Wing Commander) పై బెంగళూరులో దాడి జరిగింది. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్పై వచ్చి అడ్డగించి దాడి చేశారని వింగ్ కమాండర్ బోస్, స్క్వాడ్రన్ లీడర్ అయిన ఆయన భార్య మధుమిత ఆరోపించారు. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపిస్తోంది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతోంది. బోస్ మాట్లాడుతూ.. ‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ను చూసి నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం అయ్యింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేది అని నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలామంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని కారు అద్దాలను, నా తలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా లేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి’ అంటూ కారులో రికార్డు చేసిన వీడియోను బోస్ పోస్టు చేశారు.
కాగా ఈ దాడి ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.