న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోరితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పార్లమెంటులో విభజన శక్తులకు వ్యతిరేకంగా నిలబడేందుకు ఎక్కువ మందిని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే రాజకీయ ప్రపంచంలోకి తాను అడుగు వేస్తానని తెలిపారు. ‘నేను రాజకీయాల్లో ఉండాలని కాంగ్రెస్ భావిస్తే నా కుటుంబం ఆశీర్వాదంతో ఆ అడుగు వేయాలని భావిస్తున్నా’ అని మీడియాతో అన్నారు. తన భార్య ప్రియాంక, తన బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిగిందని చెప్పారు.
కాగా, గాంధీ కుటుంబంలో సభ్యుడిని కావడం వల్లనే తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. చాలా కాలంగా చాలా పార్టీలు తన పేరును వాడుకుంటున్నాయని విమర్శించారు. ‘ప్రతిసారీ ఎన్నికలప్పుడు వారికి నా పేరు గుర్తుకు వస్తుంది. వారు తప్పు చేయాలనుకునే ప్రతిసారీ నా పేరును గుర్తు చేసుకుంటారు’ అని అన్నారు.