BS VI Vehicles | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు నిర్దేశించిన వయో పరిమితి బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలకు సైతం వర్తిస్తుందా? లేదా? అని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారించనున్నది. వాస్తవానికి పెట్రోల్ వాహనాలకు 15 సంవత్సరాలు, డీజిల్ వాహనాలకు కేవలం పదేళ్లు మాత్రమే వయో పరిమితి ఉంది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్ను విచారించేందుకు అంగీకరించింది. ఈ విషయం చాలా ముఖ్యమైందని.. కోర్టు సూచనలను విస్మరించి ప్రభుత్వం నియమాలను అమలు చేయడం లేదని పిటిషన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఢిల్లీలోని కాలుష్యాన్ని నియంత్రించడానికి సుప్రీంకోర్టు ఇప్పటికే వాహనాలకు వయో పరిమితులను నిర్ణయించిందని న్యాయవాది తెలిపారు.
కోర్టు ఆమోదం లేకుండా వాటిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొత్త టెక్నాలజీ వాహనాలకు పాత నియమాలే వర్తిస్తాయో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అందరి దృష్టి ఈ నెల 28న జరిగే విచారణపై ఉన్నది. ఎన్సీఆర్లో నడుస్తున్న కొత్త బీఎస్-6 వాహనాలను కూడా నిర్దిష్ట సమయం తర్వాత నిలిపివేస్తారా? లేదంటే ఉపశమనం ఇస్తారా? అనేది వేసి చూడాల్సిందే. చట్టం ప్రకారం, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో డీజిల్ వాహనాల ప్రస్తుత జీవితకాలం 10 సంవత్సరాలు. అన్ని పెట్రోల్ వాహనాలకు 15 సంవత్సరాలు. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను తగ్గించే ప్రయత్నంలో 2015లో భారతదేశ జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఎన్సీఆర్లో పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నడపడానికి అనుమతించకూడదని ఆదేశించిందని పలు నివేదికలు పేర్కొన్నాయి.