Akhilesh Yadav : దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
‘సరైన ప్లానింగ్ లేని ఇలాంటి భవనాలకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం కచ్చితంగా సంబంధిత అధికారుల బాధ్యారాహిత్యం. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది..? ప్రభుత్వంపై లేదా..? మరి బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తుంది..?’ అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
ఇది కేవలం ఒక అక్రమ కట్టడానికి సంబంధించిన సమస్య కాదని, ఇలాంటి అక్రమ కట్టడాలు ఢిల్లీలో ఎన్నో ఉన్నాయని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల పేరుతో బీజేపీ సర్కారు ఎన్నో బిల్డింగులను బుల్డోజర్లు పెట్టి కూల్చివేయించిందని, మరి ఢిల్లీలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు కేంద్ర సర్కారు బుల్డోజర్లను వినియోగిస్తుందా లేదా..? అని అఖిలేష్ యాదవ్ నిలదీశారు.
#WATCH | Old Rajinder Nagar incident | “It’s a painful incident. It’s the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It’s not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg
— ANI (@ANI) July 29, 2024
కాగా, ఢిల్లీ ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రవూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వర్షం కారణంగా భారీగా వరద నీరు చేరింది. అకస్మాత్తుగా వరద రావడంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న యూపీఎస్సీ అభ్యర్థులు బయటికి రాలేకపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 మందిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. కానీ మరో ముగ్గురు అభ్యర్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.