Seema Haider | జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సార్క్ స్కీమ్ కింద జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో పాకిస్తాన్ పౌరులు భారత్లో పర్యటించేందుకు అనుమతి ఉండదు. ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు వారంలోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సీమా హైదర్ మరోసారి వార్తలకెక్కారు. సీమా హైదర్ మే 2023లో నేపాల్ మీదుగా చట్టవిరుద్ధంగా భారత్కు వచ్చారు. అయితే, ఆమెను పాక్కు పంపాలని సోషల్ మీడియా వేదికగా జనం డిమాండ్ చేశారు.
సీమా హైదర్ వ్యవహారం ఇప్పటికే సోషల్ మీడియా నుంచి న్యూస్ చానెల్స్ వరకు ప్రధానాంశాల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ మీనాతో ఆన్లైన్ గేమ్ పబ్జీ ద్వారా కనెక్ట్ అయ్యింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్న ఆమె భారత్కు వచ్చి.. సచిన్ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ సైతం జన్మించింది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో సీమా హైదర్ పాకిస్తాన్కు వెళ్లిపోక తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే, సీమాపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని.. ఎందుకంటే ఆమె వీసా మార్గంలో రాలేదని తెలిపారు. కానీ, అక్రమంగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తు చేశారు.
ఆమెపై కేసు కోర్టులో పెండింగ్లో ఉందని.. నిర్ణయం వెలువడే వరకు ఆమెను దేశం నుంచి పంపించలేమని తెలిపారు. జెవార్ కొత్వాలి పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకునున్నారు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని.. పూర్తి చట్టపరమైన ప్రక్రియ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. పహల్గామ్లో దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన ఆరు సంవత్సరాల తరువాత.. లోయ మళ్లీ తడిసిపోయింది. పుల్వామాలో 40 సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. తాజాగా బైసారన్ లోయ మధ్యాహ్నం రక్తం తడిపోయింది. ఎల్లప్పుడూ పర్యాటకులతో కళకళలాడే బైసారన్ లోయలో ప్రస్తుతం వెలవెలబోతున్నది.
మరో వైపు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో ఆమె ఆసుపత్రిలో ఉందని.. ఈ ఘటన గురించి తెలుసుకొని విచారం వ్యక్తం చేసిందన్నారు. సనాతన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత సీమా పాకిస్తాన్ నుంచి నేపాల్ కు వచ్చిందని ఆయన అన్నారు. ఆమె నేపాల్ లో సచిన్ మీనాను వివాహం చేసుందని.. భారత్కు వచ్చిన తర్వాత వారిద్దరూ పూర్తి ఆచారాలతో వివాహం చేసుకున్నారు. ఆమె గత నెలలో ఒక కుమార్తెకు జన్మనిచ్చిందని.. సార్క్ వీసాను నిలిపివేయాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు. సీమాకు సంబంధించిన అన్ని పత్రాలు ఏటీఎస్, హోంమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం వద్ద జమ చేసినట్లు తెలిపారు. ఈ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందన్నారు. సీమా బెయిల్ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పాటిస్తోందని.. ఆ ఆదేశాల ప్రకారం.. సీమా రబుపురలోని తన అత్తమామల ఇంట్లో నివసిస్తోందని.. ఆమెకు చట్టంపై నమ్మకం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, కోర్టు ఆదేశాలను ఆమె పూర్తిగా పాటిస్తోందని.. భవిష్యత్తులో కూడా సీమా అన్ని ఆదేశాలను అలాగే పాటిస్తూనే ఉంటుందన్నారు. ఘటనపై ఆమె తన బాధపడిందని.. పిల్లలతో నివసిస్తున్న ఆమెకు పాకిస్తాన్ ప్రజల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయన్నారు.