భక్తియార్పూర్ : ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే, ఎల్జీపీ సిలిండర్ను రూ.500కే సరఫరా చేస్తామని తేజస్వి యాదవ్(Tejashwi Yadav) అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి పోటీ చేస్తున్నారు. ఇవాళ భక్తియార్పూర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ను అయిదు వందలకే ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ రాష్ట్రం పేద రాష్టమని, ఈ విషయం పట్ల బీహారీగా బాధపడుతున్నానని, నిరుద్యోగం.. అవినీతి, నేర సంఘటనలు రాష్ట్రంలో పెరిగినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్లో ఎన్డీఏ కూటమి 20 ఏళ్లుగా పాలిస్తోందని, కేంద్రంలో 11 ఏళ్లుగా ఉందని, కానీ రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. రైతులు ఇంకా పేదలుగానే మిగిలిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు నితీశ్ కుమార్ బీహార్ సీఎం కాలేరని తేజస్వి అన్నారు.వృద్ధుల పెన్షన్ను 1500కు పెంచనున్నట్లు చెప్పారు.