Manish Sisodia | ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై దాదాపు 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవించిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఎట్టకేలకు విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ ఇవ్వడంతో ఈ నెల 9న ఆయన విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఆయన మళ్లీ డిప్యూటీ సీఎం పగ్గాలు (Deputy Chief Minister) చేపడతారంటూ రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై సిసోడియా తాజాగా స్పందించారు.
ఈ మేరకు జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి ఓ జాతీయ మీడియాకు సిసోడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పగ్గాలు తిరిగి చేపట్టడం గురించి స్పందించారు. ‘ఢిల్లీ డిప్యూటీ సీఎంగా తిరిగి బాధ్యతలు చేపడతారా..?’ అని విలేకరు ఆప్ నేతను ప్రశ్నించారు. దీనికి సిసోడియా ‘అలా చేయొచ్చు.. కానీ ఈ విషయంలో నేను తొందరపడను. ప్రస్తుతం అందరినీ కలవడంలో బిజీగా ఉన్నాను’ అంటూ సమాధానమిచ్చారు. ఇక ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే బయటకు వస్తారని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు.
‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులే అయ్యింది. కేజ్రీవాల్ కూడా త్వరలోనే తిరిగి రానున్నారు. అరవింద్ జీ వచ్చాక నేను పార్టీ ప్రమోషన్లో ఉండాలా..? లేక ప్రభుత్వంలో ఉండాలా..? అనేది సీఎం, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని సిసోడియా స్పష్టం చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో బీజేపీపై సిసోడియా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళతానని అనుకోలేదన్నారు. తమ నాయకులను జైల్లో పెట్టి పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు.
Also Read..
Pinarayi Vijayan | వయనాడ్ బాధితులకు అద్దె సాయంగా రూ.6వేలు.. ప్రకటించిన కేరళ సీఎం
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ మృతి
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు