Sanjay Raut | కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్నది. బెళగాం విషయం రెండు రాష్ట్రంలో బెట్టుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెళగాంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలోనే ప్రస్తుత శీతాకాల సమావేశాలను కర్ణాటక నిర్వహిస్తున్నది. దీనిపై మహారాష్ట్ర నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే సమయంలో శివసేన (ఉద్దవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం మాదిరిగానే కర్ణాటకలోకి వస్తామంటూ కొత్త వివాదానికి తెర లేపారు.
‘ మన దేశంలోకి చైనా చొరబడినట్లుగానే.. మేం కర్ణాటకలోకి వెళ్తాం.. మాకు ఎవరి అనుమతి అవసరం లేదు.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నా కర్ణాటక సీఎం బొమ్మై అస్సలు ఒప్పుకోవడం లేదు. మాపై నిప్పులు చెరుగుతున్నారు. మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉండటం వల్లనే ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదు ’ అని సంజయ్ రౌత్ చెప్పారు.
దశాబ్దాల నాటి సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర-కర్ణాటకల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో సంజయ్ రౌత్ ప్రకటన తెరపైకి వచ్చింది. సరిహద్దు అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ అంశంపై ఏకనాథ్ షిండే ప్రభుత్వం నాలుగు వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి.