కోల్‌కతా: పరమాత్ముడే తనను ఓ కారణం కోసం ఈ భూమ్మీదకు పంపినట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు. దేవుళ్లు రాజకీయాలు చేయవద్దు అని, హింస జరిగేలా రెచ్చగొట్టవద్దు అని ఆమె అన్నారు. కోల్‌కతాలో ఓ ర్యాలీలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. ఒకవేళ మోదీ తనకు తాను దేవుడిగా భావిస్తే, ఆయన కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని, అక్కడే ఆయన ఆసీనులవుతారని, ఈ దేశాన్ని ఇబ్బందిపెట్టడం ఆగిపోతుందని ఆమె అన్నారు. దేవుళ్లకే దేవుడిని అని ఒకరు అంటున్నారని, జగన్నాథుడే తన భక్తుడు అని ఒకరు అంటున్నారని, ఒకవేళ ఆయన దేవుడే అయితే, అప్పుడు ఆయన రాజకీయాలు చేయవద్దు అని, అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టరాదు అని, ఆయన కోసం ఆలయాన్ని నిర్మిస్తామని, అక్కడ ఆయన్ను పూజిస్తామని, ప్రసాదం,పువ్వులు సమర్పిస్తామని, ఆయనకు దోక్లా కూడా నైవేద్యం పెడుతామని దీదీ సెటైర్ వేశారు.
దేవుడు పంపిన దూతను తాను అని ఇటీవల ప్రధాని మోదీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. ఎంతో మంది ప్రధానులతో పనిచేశానని, అటల్ బిహారీ వాజ్‌పేయి తనను ఎంతో ఇష్టపడేవారని, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నర్సింహారావు, దేవ గౌడలతో కలిసి పని చేశానని, ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి ప్రధాని అవసరం లేదని మమతా అన్నారు.