శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాకపోయినా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మద్దతును తమ పార్టీ స్వీకరిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తెలిపారు. జమ్ముకశ్మీర్‌ను రక్షించడానికి అన్ని పార్టీలు కలిసి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఆ కూటమికి మద్దతు ఇచ్చేందుకు పీడీపీ సిద్ధంగా ఉందన్న వార్తలపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ‘మాకు అవసరం లేకపోయినా, మేం (పీడీపీ) మద్దతు తీసుకుంటాం. ఎందుకంటే మనం ముందుకు వెళ్లాలంటే కలిసి పని చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మనమందరం కృషి చేయాలి. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది’ అని అన్నారు.
కాగా, ఎన్నికల తర్వాత పొత్తుపై మెహబూబా ముఫ్తీతో తాను మాట్లాడలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. తమ కూటమికి మద్దతిస్తానన్న ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. మేమంతా కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
మరోవైపు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలపై తాను ఉత్సాహంగా లేనని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఎందుకంటే ఎగ్జిట్‌పోల్స్ సరైనవి లేక తప్పు కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాతే అసలు ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. అయితే ఎన్సీ, కాంగ్రెస్ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు.