ఒక మహిళ అనుమతి లేకుండా.. ఆమె భర్త అయినా సరే వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణని రికార్డ్ చేయడం ఆమె వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనని సోమవారం పంజాబ్ మరియు హర్యాణా హై కోర్టు చెప్పింది. ఇటువంటి ఆధారాలు ప్రోత్సహించ కూడదని విడాకుల కేసు విచారణ చేస్తున్న ఫ్యామిలీ కోర్టుకు ఆదేశించింది.
తన భార్య అనుమతి లేకుండా ఒక భర్త.. ఇద్దరి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణని రికార్డ్ చేసి విడాకుల కేసు విచారణ చేస్తున్న ఫ్యామిలీ కోర్టులో దానిని ఆధారంగా ప్రవేశపెట్టాడు. ఆ ఫోన్ కాల్ రికార్డ్‌ని ఫ్యామిలీ కోర్టు ఆధారంగా స్వీకరించింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇటువంటి కాల్ రికార్డ్‌ని ఆధారంగా అనుమతించడంపై సదరు భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ హై కోర్టుని ఆశ్రయించింది.
ఆ మహిళ పిటీషన్ని విచారణని స్వీకరించిన హై కోర్టు.. అనుమతి లేకుండా ఆమె భర్త ఫోన్ కాల్ రికార్డ్ చేయడం ఆమె వ్యక్తిగత అధికారాలకు భంగం కలిగించడమే అవుతుందని చెప్పింది. ఆ ఫోన్ కాల్ రికార్డ్‌ని ఆధారంగా పరిగణించవద్దని ఫ్యామిలీ కోర్టును సూచిస్తూ విడాకుల కేసులో 6 నెలలలోగా తీర్పునివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.