Suicide | భార్య దైవదర్శనం కోసం వెళితే.. ఆమె భర్త తన తల్లి, కొడుక్కి విషమిచ్చి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది. తరుణ్ చౌహాన్ అనే వ్యక్తి భార్య రాజస్థాన్‌లోని సికార్‌లో గల ఖట్టు శ్యామ్‌జీ దేవాలయ సందర్శనకు వెళ్లారు. తమ ఇంట్లో విషాదం సంగతి తెలియగానే ఆగ్రాకు బయలుదేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తరుణ్ చౌహాన్ ఇంటి పని సహాయకురాలు ఇంటికి వచ్చినప్పుడు తరుణ్ మ్రుతదేహం సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతుండటం, బెడ్ పై ఆయన తల్లి, కొడుకు మ్రుతదేహాలు ఉంటడం గమనించి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. తరుణ్ తొలుత తన కొడుక్కి, తర్వాత తల్లికి విషమిచ్చి ఉంటాడని పోలీసులు చెప్పారు. అటుపై సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని మరణించి ఉండొచ్చునని తెలిపారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో అసలు కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
తరుణ్ తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుండేదని స్థానికులు చెప్పారు. అప్పుల భారం భరించలేక తరుణ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ‘ఆయన ఎందుకు అప్ సెట్ అయ్యాడో మాకు తెలియదు. పెప్సీ డీలర్ షిప్ తీసుకుని భారీగా నష్టపోయాడు. అప్పుల భారం నుంచి బయట పడేందుకు ఇంటిలో కొంత భాగం అమ్మేశాడు. ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు. తరుణ్ భార్య తిరిగి వస్తే గానీ అసలు కారణం తెలియదు. ఆమెను తరుణ్ తన ప్రణాళిక ప్రకారమే దైవ దర్శనానికి పంపాడా..? ఆమె తనంతట తాను వెళ్లిందా? తెలియదు. ఆమె వస్తే గానీ అసలు సంగతి బయటకు రాదు’ అని స్థానికులు చెప్పారు.