PM Modi | ఎవరిది విజయం.. ఎవరిది అపజయం. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడటానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబురాలు చేసుకున్నది? భారత దేశం ఎందుకు విస్మయంలో మునిగిపోయింది? అమెరికాకు, యూఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు?.. మనం మాత్రం కాల్పుల విరమణకు కారణమెవరో ఎందుకు చెప్పలేకపోతున్నాం?
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తమ మధ్యవర్తిత్వం ఫలితంగానే కాల్పుల విరమణ సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (మూడో పక్షం) ఘనంగా, బహిరంగంగా ప్రకటించుకుంటుంటే.. మూడో పక్షం జో క్యాన్ని అనుమతించబోమని మనమెందుకు బయటికి చెప్పలేకపోతున్నాం? కేవలం గుసగుసలకే ఎందుకు పరిమితం అయ్యాం? అసలేం జరిగింది..? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పు డు దేశవ్యాప్తంగా 2వ పేజీలోప్రతి బుద్ధి జీవి మదిని తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి. మోదీ ప్రభుత్వం, బీజేపీ వ్యవహార శైలి మీద తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో, మేధావుల్లోనూ, రక్షణ రంగ నిపుణుల్లోనూ, జియోస్ట్రాటజిస్టుల్లోనూ, చివరికి సామాన్య ప్రజల్లో కూడా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతున్నది. ఇది చర్చ కాదు.. ఒక రకంగా చెప్పాలంటే కోట్ల మంది ప్రజలకు గుండెకోతగా మారింది. ‘ఒక సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాం.. ఇది కేంద్ర ప్రభుత్వం వ్యూహరాహిత్యం కావొచ్చు.. మోదీ వ్యక్తిగత బలహీనతైనా కావొచ్చు.. మొత్తంమీద శత్రువును ముక్క చెక్కలు చేసి కాళ్ల బేరానికి రప్పించుకునే అవకాశాన్ని కోల్పోయాం’ అని మథనం జరుగుతున్నది.
అత్యంత బలహీనంగా పాక్
పాకిస్థాన్ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నది. అంతర్గతంగా రాజకీయ సుస్థిరత లేదు. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వేర్పాటువాద గ్రూప్‌లు పాకిస్థాన్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటు అఫ్గానిస్థాన్తోనూ సయోధ్య లేదు. ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా పాక్‌ను పెద్దగా లెక్క చేయడం లేదు. పాక్‌లో మోస్ట్ పాపులర్ లీడర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో వేయడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి, సైన్యానికి చుక్కలు చూపిస్తున్నాయి. అటు ఉగ్రవాద మూకలు పాక్‌లోనే ఎవరిపై, ఎక్కడ, ఎందుకు దాడి చేస్తున్నాయో కూడా తెలియడం లేదు. దేశవ్యాప్తంగా పేలుళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. డాలర్‌తో మారకం పడిపోయి, విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోయి, జీడీపీ పతనమై, ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. చివరికి ప్రజలకు సరిపడా గోధుమ పిండి కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.250 దాటింది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కంటిలో నలుసుగా మారిన పాకిస్థాన్ పీడను వదిలించడానికి ఇంతకు మించిన అనుకూల పరిస్థితి ఏముంటుంది? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. పాక్‌ను ముక్కలు చెక్కలు చేసే అవకాశాన్ని వదులుకోవడం ద్వారా మోదీ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసిందని అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన పొరబాటు, మోదీ నిర్ణయరాహిత్యం ఫలితంగా దేశానికి తరతరాలకు తేరుకోలేని పెను శాపంగా మారే ప్రమాదం ఉన్నది.
దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తున్నది.
యుద్ధంగా మలిచే సువర్ణావకాశం..
ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆపరేషన్ సిందూర్‌ను మొదలు పెట్టింది.
పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీనికి అన్ని ప్రపంచ దేశాల నుంచి ఆమోదం లభించింది. భారత్‌కు ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసే అధికారం ఉన్నదని మద్దతు పలికాయి. దీనికి ప్రతిగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో మన దేశ భూభాగంపై, ప్రజలపై, సైన్యంపై, గురుద్వారాలపై దాడి చేసింది. దీన్ని యుద్ధంగా మలచడానికి ఇంతకు మించి కారణం అవసరం లేదన్నది రక్షణ రంగ నిపుణుల మాట. బలూచిస్థాన్‌ను విడగొట్టడానికి గానీ, పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి గానీ ఇంతకు మించిన సమయం రాదని మేధావులు చెప్తున్నారు. పాకిస్థాన్ నుంచి బలూచ్‌ను, పీవోకేను వేరుచేసి ఉంటే ఈ దాడికి ఒక పరమార్థం ఉండేది. అలా కాదని కేంద్ర ప్రభుత్వం ఏ ఒత్తిడికి తలొగ్గి.. కాల్పుల విరమణకు అంగీకరించిందో అంతుపట్టడం లేదని రక్షణ నిపుణులు వాపోతున్నారు.
భారత దేశ చరిత్రను గమనిస్తే రాజుల కాలం నుంచి కూడా యుద్ధంలో తాడో పేడో తేల్చుకోకుండా వెనుతిరిగిన సంఘటనలు లేవు. కానీ అన్ని విధాల పైచేయి ఉన్నప్పటికీ ఇప్పుడెందుకు కాల్పుల విరమణను పాటించాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘విజయం అంచుల వరకు వెళ్లి.. ఓటమిని ఒప్పుకోవడం భారత్‌కు అలవాటైంది’ అని ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం పరిస్థితులు భారత్‌కు చాలా అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్ సైనిక శక్తి డొల్లతనం బయటపడింది. పాకిస్థాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించగా, భారత్ సమర్థంగా అడ్డుకున్నది. ఇదే సమయంలో భారత సైన్యం పరిమిత సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించి లక్ష్యాలను ఛేదించగలిగింది. దీంతో పాకిస్థాన్ వైమానిక దళం డొల్లతనం బయటపడింది. వారి సైనిక శక్తి చాలా బలహీనంగా ఉన్నదని తేలిపోయింది. ఇలా స్పష్టంగా భారత సైన్యం పైచేయి సాధిస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారన్నది మిస్టరీగా ఉంది. తన ప్రసంగంలో మోదీ దీనికి వివరణ ఇస్తాడనుకుంటే అదీ జరగలేదు’ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
షరతులు ఏమిటో ఎందుకు చెప్పరు?
యుద్ధాల్లో కాల్పుల విరమణ అసహజమేమీ కాదు. అయితే.. కొంత సమయం తీసుకోవడానికో లేదా లొంగిపోవడానికో దెబ్బతిన్న దేశం కాల్పుల విరమణను ప్రకటిస్తుంటుంది. పైచేయిలో ఉన్న దేశం కాల్పుల విరమణ ప్రకటించాలంటే షరతులు విధిస్తుంది. ఆ షరతులకు శత్రు దేశం ఒప్పుకుంటేనే విరమణకు అంగీకరిస్తామని చెప్తుంది.
యుద్ధంలో పైచేయి సాధించామని, పాక్ తీవ్రంగా దెబ్బ తిన్నదని, యుద్ధం ఆపాల్సిందిగా బిచ్చం ఎత్తుకున్నదని ఇప్పుడు మోదీ చెప్పారు. పాకిస్థానే కాల్పుల విరమణకు మొదటగా ప్రతిపాదన చేసిందని, మనం అంగీకరించామని పేర్కొంటున్నది. మరి కాల్పుల విరమణ అంగీకరించడానికి మనం విధించిన షరతులు ఏమిటి? అనేది ఎందుకు చెప్పడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘పీవోకేను స్వాధీనం చేయాలని అడిగినామా? లేదా పహల్గాంలో కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశామా? మున్ముందు భారత్‌పై ఉగ్రదాడులు జరగకుండా పాక్ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నామా?’ అని అడుగుతున్నారు.
‘లష్కరే తాయిబా చీఫ్ మసూద్ అజర్‌ను వాజపేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి పాకిస్థాన్‌కు పంపింది. ఆ తర్వాత ఇప్పటివరకు దేశంలో అనేక ఉగ్రదాడులకు పాల్పడి, వేల సంఖ్యలో ప్రజలను చంపడంలో అజర్ హస్తం ఉన్నది. కనీసం మసూద్ అజర్నైనా చంపామా? అప్పగించేలా పాక్‌కు షరతు విధించామా? అంటే అదీ లేదు. పోనీ మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌ను పట్టుకున్నామా? అంటే అదీలేదు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వబోమని పాక్ బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయలేదు’ అని విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మాటలో చెప్పాలంటే.. తక్షణ, పూర్తిస్థాయి కాల్పుల విరమణకు కామన్ సెన్స్‌తో ఒప్పుకున్నాం. అమెరికా అధ్యక్షుడు భారత్‌ను, పాకిస్థాన్‌ను ఒకే గాటన కట్టి కామన్సెన్స్ అనే పదజాలం వాడుతుంటే ఖండించే ధైర్యం కూడా మోదీ సర్కారుకు లేకుండా పోయింది. నాడు 1971 యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీని అమెరికా అధ్యక్షుడు వైట్ హౌజ్‌కు పిలిపిస్తే.. ‘నా దేశం గురించి నేను నిర్ణయం తీసుకుంటాను, నువ్వెవరు చెప్పేది?’ అని మొఖం మీదే చెప్పి, అమెరికా అధ్యక్షుడితో జరగాల్సిన సంయుక్త మీడియా సమావేశాన్ని రద్దు చేసుకొని వచ్చారు. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏకంగా అమెరికాలో మీడియా ముందే ట్రంప్‌తో వాగ్వాదానికి దిగి సమావేశం మధ్యలోనే బయటికి వచ్చేశారు. కమెడియన్ నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగిన జెలెన్ స్కీ కూడా రష్యాతో కాల్పుల విరమణ చేసుకోమంటే అమెరికా అధ్యక్షుడినే ఎదిరించి బయటికి వెళ్లిపోయాడు. మరి.. నాడు ఇందిరాగాంధీ చేసిన పని, నేడు జెలెన్స్కీ చేసిన పనిని విశ్వగురుగా చెప్పుకొనే మోదీ ఎందుకు చేయలేకపోయారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
సన్నద్ధమైన తర్వాత ఎందుకిలా?
ఆపరేషన్ సిందూర్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్‌తో యుద్ధానికి దేశంలోని అన్ని పక్షాలూ మోదీకి మద్దతిచ్చాయి. పీవోకేను స్వాధీనం చేసుకోవడమే సమస్యకు పరిష్కారం అని కూడా చెప్పాయి. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు జరిగాయి. 259 ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని పిలిపించాలంటూ ఆర్మీ చీఫ్‌కు కేంద్రం అధికారాలు జారీ చేసింది. ఢిల్లీలో అనేక చోట్ల ఎయిర్ రైడ్ సైరన్లు బిగించారు. మరోవైపు.. మోదీ ప్రభుత్వం పాక్‌లోని సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఒక దేశ సైనిక, వైమానిక స్థావరాలపై మరో దేశం దాడి చేస్తే యుద్ధానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసీ అనుమతి ఇవ్వడం అంటే.. యుద్ధానికి సిద్ధమైనట్టే కదా? అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంత చేసిన తర్వాత అకస్మాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారన్నది అసలు ప్రశ్నగా మారింది. పైగా చైనా విదేశాంగ శాఖ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ‘యుద్ధం భారత్ విధానం కాదని, పాక్‌తో శాంతి పునరుద్ధరణకు ప్రయత్నిస్తాం’ అని కాల్పుల విరమణ తర్వాత సర్ది చెప్పుకున్నారు. ఇతర దేశాల నుంచి ఒత్తిడి రావడం వల్లే మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందని, తద్వారా దేశం పరువు తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మనం ఎందుకు తగ్గాం?
పాకిస్థాన్‌తో ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు, సైనిక ఘర్షణలను పరిశీలిస్తే.. భారత్ స్పష్టంగా పైచేయి సాధించడమే కాదు.. ఎప్పుడు ముగించాలన్నది కూడా మనమే నిర్ణయించేవాళ్లం. కానీ ఈసారి మాత్రం మూడో వ్యక్తి తలదూర్చి, మనం ఏం చేయాలో నిర్ణయించాడు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్.. ఇలా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో మూడో దేశం పాత్ర నామమాత్రం. కానీ భారత్-పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో మాత్రం అమెరికా వచ్చి చేరింది.
భారత సైన్యం బలాన్ని ఎదుర్కోలేక ముందుగా పాకిస్థాన్ నుంచే కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ మన త్రివిధ దళాల దాడిలో వాళ్ల స్థావరాలు దెబ్బతినడం వల్లే కాళ్ల బేరానికి వచ్చి ఉంటే.. ‘పాక్ ప్రధాని ఆ దేశంలో విజయోత్సవ ప్రసంగం ఎందుకు చేసినట్టు?, తామే గెలిచామని ఎందుకు ప్రకటించుకున్నట్టు’ అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఓటమిని ఒప్పుకున్నవాళ్లు ఎక్కడైనా సంబురాలు చేసుకుంటారా? అని అడుగుతున్నారు. పైగా పాకిస్థాన్ తానే కాల్పుల విరమణ ప్రతిపాదించి ఉంటే మళ్లీ తానే డ్రోన్లతో దాడిచేసి ఒప్పందాన్ని అతిక్రమిస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మోదీ ప్రభుత్వం ఏ కారణం వల్లనో రాజీ పడినట్టు అనిపిస్తున్నదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా పహల్గాం దాడి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే భారత సైన్యం విజయం సాధించగా.. మోదీ ప్రభుత్వం విఫలమైనట్టు స్పష్టం అవుతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. పాక్ విషయంలో ఇతరత్రా అవసరాలు ఏమైనా భారత రాజకీయ నాయకత్వాన్ని పట్టు సడలించేలా చేశాయా? ఎవరితో ఎవరు రాజీ పడ్డారు? ఎవరితో ఎవరు సర్దుబాటు చేసుకున్నారు? భారత్ పరువును నట్టేట ముంచుతూ పాక్‌ను బెయిలవుట్ చేసిందెవరు? ఎందుకిలా జరిగిందనేది ఇప్పటికైనా నిజాయితీగా బయటపెట్టాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది.