Hyderabad House | రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు శుక్రవారం భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశానికి హైదరాబాద్ హౌస్ వేదిక కానున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ భవనంలో ప్రపంచ నేతలు, రాయబారులు సమావేశవుతుంటారు. ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ చివరి నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందింది. ఈ భవనాన్ని నిజాం రాజు ఎంతో ఇష్టంగా కట్టించుకున్నారు. చరిత్రలోకి వెళ్తే.. బ్రిటీ పాలకులు తమ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి తరలించారు.
ఆ సమయంలో పలువురు రాజులు తమకు కొత్త రాజధానిలో భవనాలు ఉండాలని భావించారు. ఇందు కోసం అలీఖాన్ ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ పక్క ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతంలో స్థలం కావాలని బ్రిటీష్ పాలకులను కోరారు. అయితే, ఈ అభ్యర్థనను అంగీకరించిన బ్రిటీష్ ప్రభుత్వం.. కింగ్స్ వే (రాజ్‌పథ్) చివరలో కింగ్ జార్జ్ వీ విగ్రహం చుట్టూ హైదరాబాద్, బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ పాలకులకు భూమిని కేటాయించింది. నిజాం రాజు, బరోడడా రాజు తమ ప్యాలెస్‌ల నిర్మాణ బాధ్యతలను అప్పటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌గా పేరుపొందిన ఎడ్విన్ లుటియెన్స్‌కు అప్పగించారు. దాంతో ఆయన 8.2 ఎకరాల స్థలంలో హైదరాబాద్ హౌస్‌ను సీతాకోకచిలుక ఆకృతిలో నిర్మించారు. రెక్కలు పక్క రోడ్లతో కలిసిపోయేలా తీర్చిదిద్దారు. ఈ భవనం దేశ రాజధాని నగరంలో అత్యంత గొప్ప కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. 1920లోనే సుమారు 2లక్షల పౌండ్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం విలువ రూ.170 కోట్లు. ఈ భవనంలో తన వైభవానికి తగ్గకుండా నిజాం నవాబు కట్టించారు. ఈ భవనంలో 36 గదులు, ఆరు టైల్డ్ బాత్రూంలు, ప్రాంగణాలు, తోరణాలు, అద్భుతమైన మెట్ల మార్గాలు, ఫౌంటెన్స్తో లుటియెన్స్ నిర్మించారు.
ఈ భవనంలో వైస్రాయ్ హౌస్ నుంచి కేవలం మధ్యలో ఒక గోపురం డిజైన్‌ను తీసుకున్నారు. ఈ ప్యాలెస్‌లో మహిళల కోసం 12-15 గదులతో కూడిన ఒక అంతపురం సైతం ఉండేది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం 1948లో భారత్‌లో విలీనమైంది. ఆ తర్వాత హైదరాబాద్ నిజాం నవాబు ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఈ భవనం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1974లో విదేశాంగ శాఖ స్వాధీనం చేసుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. అశోక్ రోడ్లో ఉన్న ఈ భవనం ఆ తర్వాత ప్రధానమంత్రి అతిథి గృహంగా మారగా.. ఈ భవనం అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, యూకే ప్రధాని గోర్డాన్ బ్రౌన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇచ్చింది. తాజాగా ఈ హైదరాబాద్ హౌస్ మరోసారి వార్తలకు ఎక్కింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య శుక్రవారం చర్చలు జరుగనున్నాయి.