చెన్నై: ప్రధాని నరేంద్రమోదీపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తున్నదన్న ప్రధాని వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్షాలపై ప్రతీకార(శత్రుత్వ) రాజకీయాలు చేస్తున్నానని మొదటిసారి ఒక ప్రధాని పార్లమెంట్లో అంగీకరించారు. ఇది దేశ భవిష్యత్తుకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని హితవు పలికారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు నేరుగా బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలేనని అన్నారు. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి పార్లమెంట్లో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
‘మీలో ఒకడిని’ కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రశ్నలకు మంగళవారం స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మోదీ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ‘ప్రధానిపైన, బీజేపీ ప్రభుత్వంపైన అనేక ఆరోపణలున్నాయి. కానీ వాటికి ప్రధాని సమాధానం చెప్పరు. ప్రజల నమ్మకమే తనకు రక్షణ కవచమని ఆయన చెబుతారు. కానీ ప్రజలెవరూ అది నిజమనుకోవడం లేదు’ అని స్టాలిన్ అన్నారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ చేసిన డాక్యుమెంటరీపైన కానీ, అదానీ గ్రూప్ వ్యవహారంపైన గానీ ప్రధాని ఎలాంటి వివరణ ఇవ్వలేదని విమర్శించారు.