డెహ్రాడూన్, జనవరి 6: కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల చెంత ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పట్టణంలో ఇండ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణాలను కలాచంద్ సైన్ వివరించారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. ఈ కొండచరియల శిథిలాల మీద జోషీమఠ్ నిర్మాణం జరిగిందని, అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్ జోన్- 5లో ఉండటం, ఇక్కడి నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇక్కడి శిలలు కాలక్రమేనా బలహీనంగా మారిపోయాయన్నారు.
1886 నుంచి హెచ్చరికలు
జోషీమఠ్‌కు ప్రమాదం పొంచి ఉండటం గురించి చాలా ఏళ్ల నుంచి హెచ్చరికలు ఉన్నట్లు కలాచంద్ సైన్ తెలిపారు. 1886లో హిమాలయన్ గెజెటర్‌లో జోషీమఠ్ కొండచరియల శిథిలాల మీద నిర్మితం అవుతున్నదని ఆట్కిన్స్ రాశారని చెప్పారు. 1976లో కూడా మిశ్రా కమిటీ జోషీమఠ్‌కు పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించిందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో జనాభా పెరగడం వల్ల కట్టడాలు పెరగడం, పర్యాటక ప్రాంతంగా ఉండటం వల్ల హోటళ్ల వంటి భారీ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు సమస్య జఠిలమైందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో చాలా ఇండ్లు కూలిపోవచ్చని, ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
జోషీమఠ్‌లో కూలిన ఆలయం
ఇప్పటికే ఇండ్లు, రోడ్లకు పగుళ్లు వచ్చి జోషీమఠ్ ప్రజలు భయాందోళనలతో ఉన్న సమయంలో ఓ ఆలయం కూలిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 15 రోజుల క్రితమే ఈ ఆలయానికి పగుళ్లు రావడంతో ఎవరూ లోనికి వెళ్లడం లేదు. శుక్రవారం ఉన్నట్లుండి ఆలయం కూలిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న హెలాంగ్ – మార్వారీ బైపాస్ రోడ్డు నిర్మాణం, ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశారు. ఇక్కడి ఔలి రోప్‌వేకి పగుళ్లు ఏర్పడటంతో ఈ సేవలను ఆపేశారు.