Constitution : భారత రాజ్యాంగాన్ని (Constitution of India) ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవం (Samvidhan Divas) నిర్వహించుకుంటున్నాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే భారత రాజ్యాంగానికి సంబంధించి ఇప్పటికీ అందరికీ తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. నాడు చేతులతో రాసిన రాజ్యాంగ అసలు ప్రతులు పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి.
భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో వీటిని అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. భారత ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా పనిచేసే ఈ రాజ్యాంగం అసలు ప్రతులను ప్రముఖ కాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ఆంగ్లంలో రాయగా.. హిందీ వర్షన్‌ను మరో వ్యక్తి రాశారు. వీటిలోని పేజీలను శాంతినికేతన్‌కు చెందిన కళాకారులు అందంగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం ఈ రాజ్యాంగ ప్రతులు పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీలో ప్రత్యేకంగా రూపొందించిన గాజుపెట్టెలో భద్రంగా ఉన్నాయి. తొలుత ఉన్ని వస్త్రాల్లో చుట్టి నాఫ్తలిన్ గుళికలు పెట్టి భద్రపరిచారు. అయితే వాటిని మరింత సురక్షితంగా ఉంచేందుకు వీలుగా అమెరికాలో అనుసరిస్తున్న విధానాన్ని పాటించాలని 1994లో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అమెరికాకు చెందిన ఓ సంస్థ సహకారంతో భారత జాతీయ భౌతిక ప్రయోగశాల పలు చర్యలు తీసుకుంది.
నాడు రాజ్యాంగం అసలు ప్రతులను పేపరుపై నల్ల సిరాతో రాశారు. ఇది కాలక్రమేణా ఆక్సికరణం చెంది పాడయ్యే ప్రమాదం ఉంటుంది. గాలి, తేమ, దుమ్ము లేదా ఇతర సూక్ష్మజీవుల కారణంగా పేపర్ పాడవడం లేదా సిరా మసకబారే అవకాశం ఉన్నందున దీన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక ఛాంబర్‌ను రూపొందించారు. గాలి చొరబడని ఆ ఛాంబర్‌ను హీలియంతో నింపారు. దానిలోపల తేమ, ఉష్ణోగ్రతలను నియంత్రించే చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అందులోని పత్రాలు ఆక్సీకరణకు గురికాకుండా ఉంటాయి.
కాగా ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగానికి 1949, నవంబర్ 26న ఆమోదం లభించింది. 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. దాంతో భారతదేశం సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. 2015లో అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరిపినప్పటి నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగానూ ప్రకటించారు.