Mamata Banerjee : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బెంగాలీ ప్రజలపై దాడులు జరుగుతుండటంపై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. ఒడిశా (Odisha), మహారాష్ట్ర (Maharastra), బీహార్ (Bihar), ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రాల్లో బెంగాలీ ప్రజలపై దాడులు జరగుతున్నట్లు తనకు సమాచారం ఉన్నదని, మా వాళ్లపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
బెంగాలీ మాట్లాడుతున్నారనే కారణంతో ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న మా వలస కూలీలపై దాడులకు పాల్పడుతున్నారని, కానీ మా రాష్ట్రానికి వచ్చిన కూలీలతో మేమలా వ్యవహరించడం లేదని మమతా బెనర్జి అన్నారు. మీకు, మాకు ఉన్న తేడా ఇదేనని ఆమె వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 1.5 కోట్ల మంది మా రాష్ట్రంలో పనిచేస్తున్నారని, కానీ వారిపై మా దగ్గర ఎలాంటి దాడులు జరగడం లేదని గుర్తుచేశారు.
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జి సూచించారు. బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లపై భాష పేరుతో, ప్రాంతం పేరుతో దాడులు చేయడం సబబు కాదని అన్నారు.