Monkeypox | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కరోనా తో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మంకీపాక్స్’ రూపంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తున్నది. 1958లో గుర్తించిన ఈ వైరస్ కొత్తది కానప్పటికీ, మ్యుటేషన్‌తో కొత్త శక్తిని సంతరించుకోవడం భయపెడుతున్నది.
ఆఫ్రికాలో మాత్రమే కనిపించే మంకీపాక్స్ వైరస్ స్వీడన్, పాకిస్థాన్‌కూ విస్తరించింది. గతంలో నమోదైన మంకీపాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వేరియంట్ (క్లాడ్-2) రకానికి చెందినవి. తీవ్రత తక్కువ ఉండేది. ఇప్పుడు నమోదవుతున్న కేసులు క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్) రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 10% వరకూ ఉండొచ్చు.
కరోనా విలయం మునుపు 2020లో గ్లోబల్ జీడీపీ వృద్ధిరేటు 2.5% మేర పెరుగుతుందని ప్రపంచబ్యాంకు 2019లో అంచనా వేసింది. అయితే, కొవిడ్ కేసులు, లాక్‌డౌన్‌తో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం మేర పడిపోయింది. ఇప్పుడూ ఎంపాక్స్ కేసులతో అదే పరిస్థితి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టినట్లే, మంకీపాక్స్ టీకాలకు సమయం పట్టొచ్చని గుర్తు చేస్తున్నారు.
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి, నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు కేంద్రం పేర్కొన్నది. దేశంలో కొత్తగా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.