పాట్నా, నవంబర్ 14: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే కొనసాగుతారని శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టిన జేడీయూ వెంటనే డిలీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార ఎన్డీఏ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగడంపై సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ గతంలో స్పష్టం చేసినప్పటికీ ఆయనే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని మాత్రం లాంఛనంగా ప్రకటించకపోవడం గమనార్హం. అసామాన్యుడు, అనితరసాధ్యుడైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటారని పేర్కొంటూ నితీశ్ సారథ్యంలోని జేడీయూ శుక్రవారం ట్వీట్ చేసింది.
అయితే కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేయడం సోషల్ మీడియాలో కొత్త ఊహాగానాలకు అవకాశమిచ్చింది. మరోపక్క పాట్నా అంతటా మళ్లీ నితీశ్‌కే పట్టం అంటూ జేడీయూ పేరిట పోస్టర్లు, బిల్‌బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం కూడా ఈ ఊహాగానాల వెనుక కారణంగా కనపడుతోంది. జేడీయూ పనై పోయిందంటూ ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ ఆ పార్టీ మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే బీజేపీ కన్నా తక్కువ స్థానాలను గెలుచుకోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది.
మహారాష్ట్ర తరహాలోనే బీహార్‌లో కూడా తమ నాయకులలో ఒకరిని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. శివసేనకు చెందిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో 2024 మహారాష్ట్ర ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ ఫలితాలలో తమకే అధిక సీట్లు రావడంతో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నితీశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి స్థానానికి బీజేపీ ఎంపిక చేసే అవకాశం ఉందని వదంతులు వినిపిస్తున్నాయి.
కాగా, ఎన్నికలకు ముందే బీహార్ ఎన్డీఏలో తనను తాను పెద్దన్నగా వర్ణించుకునే జేడీయూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా చెరి 101 స్థానాలలో పోటీచేసేందుకు ఆ పార్టీని ఒప్పించడంలో బీజేపీ సఫలీకృతమైంది. ఇప్పుడు అదే బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతోంది. అయితే దాదాపు 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్‌ని పూర్తిగా పక్కనపెట్టే పరిస్థితి కూడా బీజేపీకి లేదు. మహిళలు, ఈబీసీ ఓటర్లలో ఆయనకున్న పలుకుబడే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపునకు ఉపయోగపడిందన్న వాస్తవాన్ని బీజేపీ విస్మరించలేదు.