న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఎవరో తనకు తెలియదని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అజెండా ఆజ్ తక్లో చర్చలో పాల్గొన్న ఆయన బీజేపీకి చెందిన సుధాన్షు త్రివేదితో వాదనకు దిగారు. తమకు వ్యతిరేకంగా పోరాటం పేరుతో బీజేపీ లేదా కాంగ్రెస్‌లో ఎవరు సెకండ్ గేమ్ ఆడుతున్నారు అన్నదానిపై చర్చలో ఆయనతో పోటీ పడ్డారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఒకేసారి అనేక రాష్ట్రాల్లో విస్తరించడానికి చేసిన ప్రయత్నాన్ని ఒవైసీ ప్రస్తావించారు. ‘ఆమె ఇతర రాష్ట్రాల్లో పోరాడుతూ ఉండాలి. నేను మీకు చెప్తున్నాను.. రెండు మూడేండ్లలో కాంగ్రెస్ అంతర్గతంగా పేలి మరింతగా పతనమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ ఎవరు? నాకు ఆయన తెలియదు. అతనెవరో తెలిస్తే చెప్పండి’ అని అన్నారు.
తమను ప్రతి పార్టీ బి-టీమ్‌గా పిలుస్తారంటూ ఒవైసీ మండిపడ్డారు. మీరు రాహుల్ గాంధీని ఇక్కడికి పిలిస్తే, ఆయన బీజేపీ మాట్లాడే భాషనే మాట్లాడతారని విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ కూడా అలాగే మాట్లాడతారని ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ నేత త్రివేది, చర్చలో భాగంగా ఒవైసీపై ఎదురుదాడికి దిగారు. ఏఐఎంఐఎం వంటి పార్టీలు, ఒవైసీ వంటి నాయకులు కేరళ, బెంగాల్, అస్సాంలో ఎదిగేలా కాంగ్రెస్ చేసిందన్నారు. కేరళలో ముస్లిం లీగ్‌తో, బెంగాల్లో అబ్బాస్ పిర్జాదా పార్టీతో, అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన AIUDFతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదని విమర్శించారు.