డెహ్రాడూన్: హెలికాప్టర్ వద్ద సెల్ఫీ (selfie) దిగేందుకు ప్రభుత్వ అధికారి ప్రయత్నించారు. అయితే దాని వెనుక ఉన్న రెక్కలు తగలడంతో ఆయన మరణించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఈ సంఘటన జరిగింది. పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ తీసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. హెలికాప్టర్ వెనుక తిరుగుతున్న రెక్కల సమీపానికి ఆయన వెళ్లారు. దీంతో ఆ రెక్కలు ప్రభుత్వ అధికారి తలకు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, హిమాలయాల్లో సాగే పవిత్ర చార్ధామ్ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మందికిపైగా యాత్రికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యాత్రికుల నమోదు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ నెల 25న కేదార్నాథ్ ఆలయాన్ని, 27న బద్రీనాథ్ ఆలయాన్ని తెరువనున్నారు.