2014 నుంచీ ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒకే ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నది. ఓట్లు కొల్లగొట్టేందుకు ఏదో ఒక అంశాన్ని రగిలిస్తున్నది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు ఆరునెలల ముందు నుంచీ ప్రధాని చక్కర్లు కొట్టడం, ఆ ప్రాంత వేషధారణలతో ప్రజల్లోకి వెళ్లడం సరేసరి. నల్లధనం వెనక్కి తెస్తామనడం, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం.. ఇలా ఎన్నికలప్పుడే అజెండా అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికల వేళ తెచ్చిన మహిళాబిల్లు కూడా అలాంటిదే!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఒక అంశాన్ని ముందరేసుకోవడం, దాన్ని తమకు అనుకూలంగా పెద్దయెత్తున ప్రచారం చేసుకోవడం, తద్వారా ఓట్లు దండుకోవడం.. ఇది బీజేపీకి రివాజుగా మారిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే ముందు నల్లధనం ప్రకటనతో మొదలు.. తాజాగా మహిళా బిల్లు పేరిట పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131 రాజ్యాంగ సవరణ బిల్లును హడావుడిగా తీసుకురావడం వరకూ ఈ తంతు గడిచిన పుష్కర కాలంగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నది. అయితే, కాలం ఎప్పుడూ ఒక్కరికే అనుకూలంగా ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మహిళా బిల్లు నాటకమాడిన బీజేపీ సర్కార్ వ్యూహం బెడిసికొట్టింది.
పసి గట్టి.. పటాపంచలు చేసి
23న తమిళనాడు అసెంబ్లీకి, 23వ తేదీతో పాటు 29న రెండు దఫాల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు పెద్ద రాష్ర్టాల్లో ముఖ్యంగా బెంగాల్లో పట్టును సాధించడానికి బీజేపీ గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మహిళా ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి ఉచిత హామీలను కురిపించింది. అయితే, ఎన్నికల్లో గట్టి పోటీ ఉండటంతో ఇంకా ఏదో చేయాలని బీజేపీ అధినాయకత్వం భావించిన, ఇందులో భాగంగానే ఎప్పుడో పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పోలింగ్‌కు సరిగ్గా ఐదారు రోజుల ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో చర్చ పెట్టి, మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలని బీజేపీ ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. ఒకవేళ, విపక్షం ఈ బిల్లును వ్యతిరేకిస్తే.. ఆ పార్టీపై మహిళా వ్యతిరేక పార్టీగా ముద్రవేసి ఎన్నికల్లో అతివల సానుభూతిని గెలుచుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, బీజేపీ కుట్రలు ఇక్కడే బయటపడ్డాయి.
మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి ఎప్పటి నుంచో తాము అనుకొంటున్న డీలిమిటేషన్ బిల్లును కూడా పనిలో పనిగా తీసుకురావాలని బీజేపీ అధినాయకత్వం భావించింది. డీలిమిటేషన్ బిల్లును విడిగా తీసుకొస్తే, దక్షిణాది రాష్ర్టాల నుంచి వ్యతిరేకత రావొచ్చేమోనని గ్రహించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో అటు మహిళా రిజర్వేషన్లు, ఇటు డీలిమిటేషన్‌ను వ్యూహాత్మకంగా మిళితం చేసింది. అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన విపక్ష పార్టీలు.. మహిళా బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బేషరతుగా ప్రకటిస్తూనే.. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చేపడితే వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొట్టాయి. అయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లింది. దీంతో కథ అడ్డం తిరిగింది. లోక్‌సభ ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేక ఈ బిల్లు వీగిపోయింది. బీజేపీ సర్కార్ అసలు నాటకాన్ని పసిగట్టిన మహిళలు కూడా ఆ పార్టీ వైఖరిపై మండిపడుతున్నారు.
గతంలోనూ ఇదే తరహా గిమ్మిక్కులు
ఇప్పుడే కాదు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, 2019, 2023 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇలాగే చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏదో ఒక విషయాన్ని ముందరేసుకోవడం, ప్రజల్లో ఏదో ఒక సెంటిమెంట్‌ను రాజేసి, తద్వారా ఓట్లు దండుకోవడం ఆ పార్టీకి షరామామూలే అన్నట్టుగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి, ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామంటూ ప్రధాని మోదీ ఊదరగొట్టారు. ఆ మాటలను విశ్వసించిన ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, నల్లధనం హామీ నీటి మూటలయ్యింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పాక్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను బీజేపీ ప్రచారానికి వాడుకుందని విమర్శలున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి ఉదంతాలను 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచారానికి వాడుకొన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తాజాగా మహిళా బిల్లును అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధికి వాడుకొందామనుకొన్న ఆపార్టీకి షాక్ తగిలింది.
ఆరు నూరైనా… మరోసారి!131 వ రాజ్యాంగ సవరణ బిల్లుపై బీజేపీ వ్యూహాలు
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి భంగపడ్డ బీజేపీ.. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎలాగైనా దాన్ని 2029కి ముందే తిరిగి ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బిల్లు ఆమోదానికి రెండో మార్గాన్ని అన్వేషిస్తున్నదని ఎన్డీయే ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వారు ఏ మార్గంలో దానిని తిరిగి ప్రవేశపెడతారు అన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లుకు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు సరిపడా సభ్యుల బలం లేకపోయినా శుక్రవారం సభలో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొంది ఉంటే దానిని 2029లో అమలు చేసి ఉండేవారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడం, లేదా వారు ఓటింగ్ సమయంలో దూరంగా ఉండేలా చూడటం బీజేపీ వ్యూహాలు కావచ్చునని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. బల నిరూపణలో తిమ్మిని బమ్మిని చేసేలా వ్యూహాలు పన్నడం బీజేపీకి అలవాటే. ఇది పెద్ద కష్టం కూడా కావకపోవచ్చునని వారు అంటున్నారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటాన్ని నిరసిస్తూ నటి, బీజేపీ నేత హేమామాలిని, ఇతర నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసం బయట నిరసన వ్యక్తం చేశారు.