Rahul Gandhi : చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. చైనా ఆక్రమించిన భారత భూమిని ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారు ప్రధాని మోదీజీ? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడ్ని చైనా తిరిగి భారత సైన్యానికి అప్పగించిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ప్రధాని మోదీని పై విధంగా ప్రశ్నించారు. ‘అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ టోరాన్ను చైనా ఆర్మీ తిరిగి అప్పగించిందని వార్తలొచ్చాయి. మరి చైనా ఆక్రమించిన భారత భూమిని ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారు ప్రధానమంత్రి గారూ?’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి కనిపించకుండా పోయిన మిరామ్ టోరాన్ను చైనా సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ బాలుడ్ని అప్పగించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఈ నెల 19న ఈ బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందని బీజేపీ ఎంపీ ఆరోపించిన విషయం తెలిసిందే. మూలికల కోసం వెళ్లిన అతడు.. కనిపించకుండా పోయాడని ఆ ఎంపీ పేర్కొన్నారు. దీంతో ఇండియా సైన్యం అలర్ట్ అయ్యింది. వెంటనే చైనా సైన్యాన్ని అడిగింది. అప్పుడు చైన ఆ బాలుడు తమవద్ద లేడని బుకాయించింది. చివరికి ఆ బాలుడు తమ వద్దే ఉన్నాడని చైనా అంగీకరించింది.