న్యూఢిల్లీ: సైబర్ మోసాలపై కఠిన చర్యల్లో భాగంగా డిజిటల్ అరెస్టు కుంభకోణాల్లో ఉపయోగిస్తున్న పరికరాల(డివైస్) ఐడీలను బ్లాక్ చేయాలని కేంద్రం శనివారం వాట్సాప్‌ను ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ముప్పుపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కేంద్ర హోం శాఖ సైబర్ విభాగం ఐ4సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సైబర్ మోసగాళ్లు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి తరచుగా కొత్త ఖాతాలను సృష్టిస్తుండడంతో పునరావృత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు పరికర స్థాయి ఆంక్షలను విధించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంతేగాక వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారాలపై భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.