ముంబై : దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్‌ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌లోని కాషాయ తీవ్రవాదులు.. వారి అంతం కోసం వేచి ఉండాలి’ అని హెచ్చరించింది.
ఈ క్రమంలో ఆయన స్పందించారు. బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రతిదీ బాగానే ఉందని.. కానీ, బీజేపీ ప్రతినిధి రెండు వేర్వేరు మతాల ప్రజల మధ్య గొడవ సృష్టించాలని కోరుకుంటున్నారని, దేశంలో ఏదైనా జరిగితే బీజేపీనే బాధ్యత వహించాలన్నారు. మరో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న పశ్చిమ ఆసియా దేశాలు అల్‌ఖైదా ప్రకటనను ఖండించాలన్నారు.