జైపూర్ వేదికగా కాంగ్రెస్ పెద్ద బలప్రదర్శనే చేసింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ బహిరంగ సభకు హాజరయ్యారు. 2016 లో వారణాసిలో జరిగిన బహిరంగ సభే ఆమె చివరి బహిరంగ సభ. ఆ తర్వాత ఏ బహిరంగ సభలోనూ ఆమె పాల్గొనలేదు. పరిస్థితుల ప్రభావమో, పార్టీ అవసరాల దృష్ట్యానో నేడు జరిగిన జైపూర్ సభలో సోనియా పాల్గొన్నారు. దీంతో కార్యకర్తలతో సహా, అందరి దృష్టీ సోనియాపైనే కేంద్రీకృతమైంది. ఈ వేదిక ద్వారానే రాహుల్, ప్రియాంక కేంద్రంపై తీవ్రంగా నిప్పులు చెరిగారు. అయితే ఇంత పెద్ద భారీ బహిరంగ సభకు హాజరైన సోనియా… ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోనియా మాట్లాడకుండానే సభ ముగిసింది.
అయితే దీనిపై కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు అన్యాపదేశంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేది రాహులేనని, పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలన్నీ రాహులే తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. పంజాబ్ విషయంలోనూ రాహుల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకుంటున్నారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం బాధ్యతల్లో ఉన్నారు. ఒక్కసారిగా ఆయన పాత్ర తగ్గిపోయి, సిద్దూ పాత్ర పెరిగింది. ఇలా సిద్దూ పాత్ర అమాంతంగా పెరగడం వెనుక రాహుల్ హస్తముందని మాట్లాడుకుంటున్నారు. జైపూర్ వేదికగా జరిగిన ర్యాలీ కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తోందని సీనియర్లు అంటున్నారు. జైపూర్ వేదికగా రాహుల్ కేంద్రంపై చెలరేగిపోయారు. సోనియా మాత్రం కేవలం ”మార్గదర్శకత్వం” అన్న పాత్రకే పరిమితమైపోయారు. రాహుల్ మాట్లాడిన కొన్ని మాటలకు సోనియా చప్పట్లు కూడా కొట్టారు. ఇకపై పార్టీకి రాహులే సర్వస్వం అని, సోనియా ”మార్గదర్శకత్వం” అన్న పాత్ర చేపడతారని, అందుకే ఆ సభలో ఆమె మాట్లాడలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.