Jairam Ramesh : త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ సర్కారుపై హర్యనా ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆరోపించింది. మూడు వ్యవసాయ సాగుచట్టాల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించింది. రైతుల జీవనంపై బీజేపీకి ఉన్న విజన్ ఏమిటో వివరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
‘2021లో వ్యవసాయ సాగుచట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఎటు పోయాయి..? వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారు..? మోదీ సర్కారుపై హర్యానా రైతులు పూర్తిగా నమ్మకం కోల్పోయారు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. రైతులకు బీజేపీ ద్రోహం చేసిందని, వారి గళాన్ని వినిపించేందుకు రైతులు మరోసారి వీధుల్లోకి రావాల్సివచ్చిందని అన్నారు. గళం విప్పిన రైతులపై లాఠీచార్జ్ చేశారని విమర్శించారు.
రైతులపై బాష్ఫ వాయువులు ప్రయోగించారని మండిపడ్డారు. రైతుల సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వారి గౌరవప్రదమైన జీవనం, అభివృద్ధిపై బీజేపీకి ఉన్న విజన్ ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇస్తుందన్నారు. రుణ మాఫీతోపాటు 30 రోజుల్లోగా పంట బీమా చెల్లిస్తుందని వెల్లడించారు.